Latest Telugu Movie Reviews in Telugu

‘ఎన్టీఆర్ మహానాయకుడు’

విశ్లేషణ

సినీరంగంలో తిరుగులేని హీరోగా నటిస్తున్నక్రమంలోనే జనం తనపై పెట్టుకన్న ఆశలు, ఆరాధనను చూసిన నటుడు.. తన ప్రజల కోసం నాయకుడిగా మారాలనుకున్నాడు. అందుకు అప్పట్లో జరిగిన పలు సంఘటనలు కూడా కారణమనే చెప్పాలి. ఇలా తాను తెలుగుదేశం పేరుతో రాజకీయ పార్టీని స్థాపించడం.. జెండాను, ఎజెండాను రూపొందించడం.. పార్టీని స్థాపించిన తొమ్మిది మాసాల్లోనే అధికారంలోకి రావడం.. ఇది అప్పట్లోనే కాదు.. ఇప్పటికీ సంచలనాత్మకమైన విషయమే. ఏ రాజకీయ పార్టీ సాధించని ఘనత అది. టీడీపీ అవిర్భాం స‌న్నివేశంతో `య‌న్.టి.ఆర్ మ‌హానాయ‌కుడు` స్టార్ట్ అయ్యింది.

కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై ఉన్న వ్య‌తిరేక‌త‌, ప్ర‌జ‌ల్ని పార్టీలు ప‌ట్టించుకోక‌పోవ‌డం.. ఢిల్లీ నుండి వ‌చ్చే సీల్డు క‌వ‌ర్ ముఖ్య‌మంత్రిని నిర్ణ‌యించ‌డం.. ఇక్కడి ప్రజలకు ఏమైనా చేయాలంటే నేతలు ఏకంగా హస్తినకెళ్లి అక్కడి నుంచి అనుమతిని పొందాల్సిన పరిస్థితులు వుండటం.. ఇలాంటివ‌న్నీ చూసిన ఎన్టీఆర్ చైత‌న్య‌ర‌థంను సిద్ధం చేసుకుని.. దానిపై ప్ర‌త్య‌క్షంగా ప్ర‌జ‌ల‌ను క‌లసి టీడీపీ పార్టీ తెలుగువారి ఆత్మగౌరవ పార్టీ అని నినదించడంతో అసలు కథ ప్రారంభం అమవుతుంది. తిరుగులేని ఆధిక్య‌త‌తో విజ‌యాన్ని సాధిస్తారు. వ్య‌వ‌స్థ‌లోని లంచం, అవినీతిని రూపుమాపే క్ర‌మంలో కొన్ని క‌ఠిన నిర్ణ‌యాలు కూడా తీసుకున్నారు.

అవినీతి అన్నది అసలు వుండనేకూడదన్న ఉద్దేశ్యం త‌న పార్టీకి చెందిన వారిపై కూడా అధికారుల‌తో దాడులు చేయించ‌డం వంటి ప‌నులు చేశారు. దీని వ‌ల్ల ఎమ్మెల్యేల్లో కాస్త అసంతృప్తి నెల‌కొంది. అదే స‌మ‌యంలో త‌న స‌తీమ‌ణి బ‌స‌వ తారకంకు క్యాన్స‌ర్ ఉంద‌ని తెలియ‌డం.. ఆమె చికిత్స‌తో పాటు.. ఎన్టీఆర్ త‌న గుండె ఆప‌రేష‌న్ కోసం ఆయ‌న భార్య‌తో క‌లిసి అమెరికా వెళ‌తారు. అదునుగా భావించిన నాదెండ్ల భాస్క‌ర్‌రావు, ఎమ్మెల్యేలు వారి అసంతృప్తిని వ్య‌క్తం చేస్తూ ఓ లేఖ రాస్తారు. దాంతో పాటు సంత‌కాలు కూడా చేస్తారు.

ఇదే అవకాశంగా భావించిన.. భాస్క‌ర్ రావు లేఖ‌ను అవిశ్వాస తీర్మానంగా మార్చేసి ముఖ్య‌మంత్రి అయిపోతారు. హైద‌రాబాద్ చేరుకున్న ఎన్టీఆర్ తిరిగి అధికారాన్ని ఎలా ద‌క్కించుకున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న ఎలాంటి పరిస్థితుల‌ను ఎదుర్కొన్నారు. మ‌ళ్లీ ముఖ్యమంత్రి ఎలా అయ్యార‌నేది చూపించారు. ఈ మ‌ధ్య‌లో నారా చంద్ర‌బాబు తెలుగుదేశంలోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు. ఆగ‌స్ట్ సంక్షోభంలో చంద్ర‌బాబు, ఎన్టీఆర్ కు ఎలా వెన్నుద‌న్నుగా నిలిచారనే అంశాల‌ను ఈ రెండో భాగంలో చూపించారు. ఎన్టీఆర్ స‌తీమ‌ణి బ‌స‌వ తార‌కం క్యాన్స‌ర్ కార‌ణంగా శివైక్యం కావ‌డంతో సినిమా ముగుస్తుంది.

నటీనటుల విషాయానికి వస్తే..

ఎన్టీఆర్ గా నంద‌మూరి బాల‌కృష్ణ ఈ చిత్రంలో పూర్తిగా ఒదిగిపోయారు. తండ్రిలా నటించే అవకాశం తనయుడికి రావడం అదృష్టమే అయినా.. హావ భావాల ప్ర‌దర్శ‌న‌లో, సంభాష‌ణ‌లు ప‌లికే విధానంలోనూ స‌మ‌తూకం పాటించాడు. రాజ‌కీయ నాయ‌కుడిగా, భ‌ర్త‌గా ఆయ‌న పాత్ర‌లో రెండు పార్శ్వాలుంటాయి. రెండు చోట్లా.. బాల‌య్య రెండు ర‌కాలుగా క‌నిపిస్తాడు. విద్యాబాల‌న్ పాత్ర మొత్తం భావోద్వేగాల భ‌రితంగా సాగింది. ఆమె న‌ట‌న బ‌స‌వ‌తార‌కం పాత్ర‌కు మ‌రింత వ‌న్నె తెచ్చింది.

ఇక చంద్ర‌బాబు నాయుడు పాత్ర‌లో రానా దగ్గుబాటి న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. చంద్ర‌బాబు నాయుడు బాడీ లాంగ్వేజ్‌ని రానా పుణికి పుచ్చుకున్నాడు. కొన్ని ప‌దాల్ని చంద్ర‌బాబు ఎలా ప‌లుకుతారో మ‌నంద‌రికీ తెలుసు. రానా కూడా అదే విధంగా పలికడం చిత్రంలో ప్రేక్షకులను ఆకట్టుకుంది.  ఏఎన్నార్ గా సుమంత్ ని ఒకే ఒక్క స‌న్నివేశానికి ప‌రిమితం చేశారు. హరికృష్ణ పాత్రలో మెరిసిన క‌ల్యాణ్ రామ్ కూడా అక్క‌డ‌క్క‌డ క‌నిపిస్తాడంతే.

{youtube}v=Vs1BR5EbKoQ|620|400|1{/youtube}

టెక్నికల్ అంశాలకు వస్తే..

సాంకేతికంగా సినిమా నిర్మాణ విలువలు చాలా ఉన్నతస్థాయిలో వున్నాయి. ద‌ర్శ‌కత్వానికి కూడా ఈ చిత్రానికి మంచి మార్కులే పడ్డాయి. దర్శకుడు క్రిష్ ప్రతి స‌న్నివేశాన్ని చ‌క్కగా రూపోందించారు. చిత్రంలోని పాత్రాల్ని మలుచుకున్న విధానం బాగుంది. ముఖ్యంగా స‌న్నివేశాల‌కు అనుగుణంగా చ‌క్క‌టి డైలాగ్స్ రాశారు. అలాగే సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి సంగీతాన్ని, నేప‌థ్య సంగీతాన్ని అందించారు.

అస‌లు ఎన్టీఆర్‌, బ‌స‌వ తార‌కం పెరిగి పెద్ద‌వాళ్లుగా మారి.. పెళ్లి చేసుకునే క్ర‌మాన్ని రామ‌న్న క‌థ‌.. పాట రూపంలోచూపించారు. అలాగే ఇక మ‌రో సాంగ్ చైత‌న్య ర‌థం సాంగ్ తెలుగువాడి గుర్తింపు ప్ర‌శ్నించేలా సాగుతుంది. ఇక ఎన్టీఆర్ కాషాయ దుస్తులు ఎందుకు వేసుకునేవారు? అనే దానికి వివ‌ర‌ణ ఇస్తూ స‌న్నివేశాల‌ను బ‌లంగా రాశారు. దానికి త‌గిన విధంగా రుషివో, రాజ‌ర్షివో పాట కూడా ఉంటుంది. జ్ఞాన‌శేఖ‌ర్ కెమెరా ప‌నితనం అద్భుతంగా ఉంది.

తీర్పు..

తనను ఆరాధించి.. అభిమానించిన ప్రజలకోసం తానేం చేశాడో.. రాముడు తారకరాముడిగా ఎందుకు మారాడో చూపిన చిత్రం.. అయితే ఆ రాముడి తుది మజిలీ వరకు కాకుండా.. కేవలం అధికారాన్ని తిరిగి పోందిన వరకు మాత్రమే వుండటం వెలితిగా మిగిలింది. తెలుగోడి వాడి వేడిని చూపిన భావోద్వేగాల చిత్రం..

చివరగా... చివరగా.. అర్థాంగిని విస్మరించని.. ప్రజలను వదులుకోని ఓ మహానాయకుడి కథ

 

 

 
Posted: February 22, 2019, 6:22 am
‘లవర్స్‌ డే’

విశ్లేషణ

ఇలాంటి కథలు మనం ఎప్పుడో  చూసేసాం. గతంలో వచ్చిన చిత్రం, నువ్వు నేను, సొంతం లాంటి ఎన్నో సినిమాల్లో ఈ కాన్సెప్టే మనకు కనబడుతుంది. లెక్చరర్లు స్టూడెంట్స్ మధ్య వచ్చే కుళ్లు జోకులు.. ప్రేమ.. ఆకర్షణ.. స్నేహితులు.. వీటి చుట్టే తిరిగే ఈ కథ.. ఓ వయసు వారిని మాత్రం ఆకట్టుకుంటుంది. అయితే ఈ చిత్రానికి అందాన్ని, ఆకర్షణతో పాటు బోలెడంత ప్రచారాన్ని తీసుకువచ్చింది మాత్రం కన్నుగీటు పిల్ల ప్రియా ప్రకాష్ వారియర్ అనే చెప్పాలి.

ఒక్క కన్నుగీటుతో యావత్ కుర్రకారును తనవైపు తిప్పుకున్న ఈ అమ్మడు ఒక్కరోజులో సూపర్ స్టార్ గా మారిపోయింది. ఇక ఈ సినిమా అమె పేరునే నడుస్తుందని అనడానికి కారణం కూడా కేవలం ఈ కన్నుగీటు మాత్రమే. దీనికి తోడు అమె తన చేతులనే ఆయుధంగా మార్చుకుని ముద్దు తుపాకీతో యువత హృదయాలను కూడా పేల్చివేయడం కూడా యువతను సినిమాకు రప్పించేలా చేస్తుంది.

ఇది చాలదన్నట్లు టీజర్ లో లిప్ లాక్ సీన్లు.. వాలెంటైన్స్ డే రోజున లవర్స్ డే సినిమాకు రండీ అంటూ వైరటీగా అహ్వానించిన ప్రియా వారియర్ ప్రేమికులను థియేటర్ల వైపు రప్పించడంలో మాత్రం సక్సెస్ అయ్యిందనే చెప్పారు. ఇక సినిమా వెళ్లి కూర్చున్న తరువాత కానీ ఇలాంటి సినిమాలు మనం ఎన్నో ఇంతకుముందుగానే చూశామన్న ఫీలింగ్ కలగక మానదు. మరో విధంగా చెప్పాలంటే వెండితెరపై షార్ట్ ఫిల్మం చూసినట్లుగా వుంది. కేవలం ఒక్క వర్గంవారినే ఈ చిత్రం అకట్టుకుంటుంది.

ప్రేమ ఆకర్షణ కాదని, నిజమైన ప్రేమను తెలుసుకుని హీరో అమెకు తన ప్రేమను వ్యక్తం చేసే క్రమంలో విషాదం చోటుచేసుకోవడం.. దాంతోనే సినిమాకు దర్శకుడు ముగింపు పలకడం ప్రేక్షకుల కంట కన్నీరు పెట్టించాలన్న భావన కోసమేనా.? అన్న ప్రశ్నలు ఉత్పన్నంకాక తప్పవు. అంతా సరదాగా వెళ్తూన్న సమయంలో ముగింపు విషాదంగా వుండాలనే దర్శకుడు ఇలా ట్విస్ట్ ఇచ్చాడా.? అన్న ప్రశ్నలకు వినబడుతున్నాయి.

అయితే నిజమైన ప్రేమకు ఆకర్షణకు మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకుని తను నిజంగా ప్రేమిస్తున్న అమ్మాయికి తన ప్రేమను చెప్పే సందర్భంలో ఆ పాత్రను ముగించి.. అసలు దర్శకుడు ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నాడో అర్థం కాలేదు. నిజమైన ప్రేమ త్యాగాన్నే కోరుకుంటుందని పాత నానుడికి భిన్నంగా త్యాగం కన్న విషాదాన్నే కోరుకుంటుందన్న విషయాన్ని దర్శకుడు స్పష్టం చేయాలనుకున్నాడా.? అన్న సందేహాలు కూడా తెరపైకి వస్తున్నాయి.

నటీనటుల విషాయానికి వస్తే..

వింక్ గర్ల్ గా సినిమా ప్రమోషన్ నుంచే యావత్ దేశ కుర్రకారు మనస్సులలో తిష్టవేసిన ప్రియా ప్రకాష్ వారియర్ నటన బాగుంది. హీరో స్నేహితురాలిగా, ప్రియురాలిగా నటించిన నూరిన్ షరీఫ్ కూడా తన పాత్రకు జీవం పోసింది. ఇద్దరూ బాగా నటించారు. గాధ, ప్రియా పాత్రల్లో ఒదిగిపోయారు. క్లైమాక్స్ సీన్లో నూరిన్ షరీఫ్ ఎమోషన్స్ బాగా పండించింది. అయితే హీరో రోషన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. తన ముఖంలో దూర్ఫిణి వేసి వెతికినా అభినయం పాలు తక్కువే. ఒక్కటే ఎక్స్‌ప్రెషన్‌‌తో ప్రేక్షకులకు చిరాకు తెప్పించాడు. ఇక ఈ సినిమాలో మిగిలిన నటీనటులు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. దీంతో వారి సీన్లు పెద్దగా పండలేదు.

{youtube}v=WDltB_yYaIw|620|400|1{/youtube}

టెక్నికల్ అంశాలకు వస్తే..

స్కూల్ ప్రేమలు.. టీనేజ్ ఆలోచనలు.. ఆ వయసులో చేసే చిలిపి పనులు జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్న కంటెంట్ ను తీసుకుని దర్శకుడు ఒమర్ లులు కథను మలిచారు. ఈ చిత్రకథకు అనుగుణంగా సరిగ్గా సరితూగే నటీనటులను ఎంపిక చేసుకున్నారు. ప్రియా వారియర్, రోషన్, నూరిన్ షరీఫ్‌లు ఆయా పాత్రలకు పర్ఫెక్ట్ గా సరిపోయినా.. వారిని సరైన రీతిలో ఉపయోగించుకుకోలేదు దర్శకుడు.

చిత్రం ప్రారంభం నుండి ముగింపు వరకూ అసలు కథ ఎప్పుడు మొదలౌతుందనే ఎదురుచూపులే మిగిలాయి ప్రేక్షకుడికి. స్కూల్లో ప్రేమ, అట్రాక్షన్, రొమాన్స్ వీటిపై పెట్టిన శ్రద్ధ.. కథపై పెట్టలేదు. పోనీ ‘లవర్స్ డే’ టైటిల్ పేరునైనా నిలబెట్టేందుకు బలమైన సీన్లు ఏమైనా ఉన్నాయా అంటే అదీ లేదు. స్కూల్ స్టూడెంట్ ఎప్పుడూ వేసుకునే కుళ్లు జోకులతోనే క్లైమాక్స్ వరకూ తీసుకువచ్చారు. స్కూల్ డేస్ గుర్తుకు తెచ్చే ఎమోషన్స్ సీన్స్ కూడా లేకపోవడం కోసమెరుపు.

షాన్ రహ్మాన్ అందించిన పాటలు సినిమాకి హెల్ప్ అయ్యాయి. శ్రీను సిద్దార్థ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అచ్చు విజయన్ ఎడిటింగ్ ఈ సినిమాకి ప్రధాన మైనస్.. గంటన్నర సినిమాని రెండున్నర గంటపాటు సాగదీశారు. డబ్బింగ్ అతుకుల బొంతలా ఉంది తప్పితే.. ఒక్క పాత్రకు కూడా సరిగ్గా కుదరలేదు. గురురాజ్, వినోద్ రెడ్డి నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

తీర్పు..

స్కూల్లో టీనేజ్ విద్యార్థుల మధ్య ఏర్పడే కల్మషం లేని స్నేహం.. తన తోటి విద్యార్థినులపై కలిగే ఆకర్షణలను కలగలిపిన రొమాంటిక్ ఎంటర్ టైనర్.

చివరగా... టీనేజ్, యువతకు నచ్చే వినోదాత్మక చిత్రం..

{youtube}v=4XRzRslPZSA|620|400|1{/youtube}

Posted: February 14, 2019, 10:28 am
‘ఎఫ్‌2’ (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌)

విశ్లేషణ

భార్య బాధితుల జీవితాలు ఎలా ఉంటాయన్నది ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించినా.. వారి భాద ఇతరులకు ఎలాంటి వినోదం పుట్టిస్తుందో దర్శకుడు ప్రేక్షకులకు అందించాడు. బార్యబాధితులు ప‌డే ఇబ్బందుల నుంచి ఫ‌న్ ఎలా పుట్టుకొచ్చింద‌నేది సినిమాలో చూపించాడు. ప్ర‌తి ఇంట్లోనూ జ‌రిగే విష‌యాలే స్క్రీన్‌పై క‌నిపిస్తాయి. భార్య బాధితుల చిత్రం అని చెప్పుకోచ్చినా.. సంక్రాంతి సందర్భంగా కొత్త అల్లుళ్లను టార్గెట్ చేసి.. వారికి అలర్ట్ చేసినట్లు వుంది చిత్రం.

‘నువ్వు నాకు న‌చ్చావ్‌’, ‘మ‌ల్లీశ్వ‌రీ’ లాంటి చిత్రాల్లో పండించిన కామెడీని మళ్లీ పండించాడు వెంక‌టేష్. తనదైన శైలిలో కామెడీలో అడియన్స్ ను మెప్పించి.. వెంకీ ఈజ్ బ్యాక్ అన్నట్లుగా చేశాడు విక్టరీ వెంకటేష్. తొలి స‌గం పూర్తిగా వినోద ప్రాధాన్యంగా దర్శకుడు నడిపించాడు. ప్ర‌తి సీన్‌ను న‌వ్వుల‌తో పండించాడు. ప్ర‌తి పాత్ర‌కు ఒక ప్ర‌త్యేక‌త ఉంటుంది. మెహ‌రీన్‌కు కూడా ఒక మేన‌రిజం ఇచ్చి, ఆ పాత్ర ప్ర‌త్యేకంగా క‌నిపించేలా చేశాడు.

అత్తారింటిలో వెంక‌టేష్ చూపించే ఫ్ర‌స్ట్రేష‌న్ చూసి క‌చ్చితంగా న‌వ్వుకుంటారు. సందర్భోచిత కామెడీ రాసుకోవ‌డంలో ద‌ర్శ‌కుడు విజ‌యం సాధించాడు.ద్వితీయార్ధం మొత్తం యూర‌ప్ చుట్టూ తిరుగుతుంది. అయితే, ప్ర‌థ‌మార్ధంలో ఉన్న బ‌లం ద్వితీయార్ధంలో క‌నిపించ‌దు. కానీ, ఈ రెండు జంట‌లు మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు మాత్రం కిక్ ఇస్తాయి. చివ‌రిలో నాజ‌ర్ పాత్ర ప్ర‌వేశించ‌డం కూడా క‌లిసి వ‌చ్చేదే. అక్క‌డ కూడా డైలాగ్‌లు చాలా బాగున్నాయి. మొత్తంగా ఇది ఒక ఫ‌న్ రైడ్ సినిమా.

కథలో పెద్దగా కొత్తదనం లేకపోయినా.. కామెడీనే కథకు బలంగా మార్చాడు దర్శకుడు. అందులోనూ వెంకీ మార్కు కామెడీకి బాగా అలవాటు పడిన తెలుగు ప్రేక్షకులకు వరుణ్ తేజ్ తెలంగాణ యాసతో కలసి సంక్రాంతి పండగ నేపథ్యంలో మంచి విందును అందించాడు అనిల్. సందేశాల జోలికి వెళ్ల‌కుండా, సున్నిత‌మైన వినోదాన్ని చ‌క్క‌గా ఆవిష్క‌రించాడు. అయితే, వినోదాన్ని పండించ‌డంలో కొన్ని చోట్ల శ్రుతి మించిన‌ట్లు అనిపిస్తుంది. పాత్ర‌లు కూడా కొన్నిసార్లు ఓవ‌ర్ గా ప్ర‌వ‌ర్తిస్తున్నాయ‌నిపిస్తుంది. అక్క‌డ‌క్క‌డా స‌న్నివేశాల‌ను పేర్చుకుంటూ వెళ్లిపోవ‌డంతో కాస్త సాగ‌దీత‌గా అనిపిస్తుంది.

నటీనటుల విషాయానికి వస్తే..

వెంక‌టేష్ త‌న స్థాయికి త‌గ్గ వినోదం అందించే పాత్ర‌లో క‌నిపించారు. ఇద్ద‌రు తోడ‌ల్లుళ్ల ఫ్ర‌స్ట్రేష‌న్ అనే క‌న్నా, వెంక‌టేష్ ఫ్ర‌స్ట్రేష‌న్ అండ్ సజషెన్ అంటే బాగుంటుందేమో! ఎందుకంటే ఆయ‌న అనుభవించిన ఇబ్బందులు, ఎదుర్కోన్న సమస్యలను వరుణ్ చెప్పినా.. వరుణ్ మాత్రం అతన్ని లక్ష్యపెట్టకుండా సమస్యల సుడిగండంలో పడతాడు. వెంకటేష్ పాత్రే సినిమాలో హైలైట్‌. వ‌రుణ్ తేజ్ కూడా చ‌క్క‌గా న‌టించినా నవ్వులు పూయించినా.. తెలంగాణ యాస‌లో మాట్లాడటం అంతగా అప్పలేదు.

త‌మ‌న్నా చాలా రోజుల త‌ర్వాత పూర్తి స్థాయి హీరోయిన్ గా క‌నిపించింది. మెహ‌రీన్ కూడా ఈ చిత్రంలో బాగానే మెరిసింది. ఇక సీనియర్ నటులు, కమేడియన్లు రాజేంద్రప్రసాద్, ర‌ఘుబాబు, ప్ర‌కాష్‌రాజ్‌, నాజ‌ర్‌లు ఇలా ప్ర‌తి పాత్ర న‌వ్వించ‌డానికి ఉద్దేశించిందే! అన్న‌పూర్ణ‌, వై.విజ‌య జోడీగా క‌నిపించి న‌వ్వులు పంచారు. ర‌చ‌యిత‌గా అనిల్ రావిపూడి బాగా స‌క్సెస్ అయ్యాడు. వినోదమే తన బలంగా చేసుకున్న అనిల్ రావిపూడి అదే బలంలో మరో హిట్ కొట్టేశాడు.

{youtube}v=XttQbFKkeHQ|620|400|1{/youtube}

టెక్నికల్ అంశాలకు వస్తే..

పండగ పూట అంతా సరదాగా గడపాలని, సినిమాను చూసి వెళ్లిన తరువాత అందులోని సన్నివేశాలను తలుచుకుని నవ్వుకునేలా తెరకెక్కించాడు దర్శకుడు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రేక్షకులను నవ్వించాలన్న టార్గెట్ ను దర్శకుడు బాగానే చేరుకున్నాడు‌. అయితే ద్వీతీరార్థంలో చిత్రంలో కొన్ని సన్నివేశాలను జోడించి హస్యం పండించడానికి చేసిన ప్రయత్నాలు వినోదభరితంగా లేవని అనిపిస్తుంది. ట్విస్టులు, హంగుల‌వైపు వెళ్ల‌లేదు. మొద‌టి నుంచి చివ‌రి వ‌ర‌కూ ఒకేలా ఉంది.

మొత్తానికి సంక్రాంతి వచ్చే కొత్త అల్లుళ్లతో బాధలు పడే అమ్మాయిల తల్లిదండ్రులు సినిమాలకు బదులు.. కొత్త అల్లుళ్లు పారాహుషార్ అంటూ అప్రమత్తం చేసేలా వుంది. దేవిశ్రీ ప్ర‌సాద్ అందించిన సంగీతం ప‌ర్వాలేదు. అయితే,  పాట‌లు అన్నీ ఆక‌ట్టుకోలేదు. యూర‌ప్‌లో తెర‌కెక్కించిన పాట మాత్రం బాగుంది. కెమెరా ప‌రంగా క‌ల‌ర్ ఫుల్‌గా ఉందీ సినిమా. కత్తెరకు కొంత పని చెప్పివుంటే బాగుండేందని ద్వీతీరార్థంలోని కొన్ని సన్నివేశాలు అనిపిస్తాయి. కథ ఇత్తివృత్తం ఇంకొంచెం సరదగా నడిపించివుంటే బాగుండేదనిపిస్తుంది. సినిమాలో డైలాగులు బాగా పండాయి. 

తీర్పు..

భార్య బాధిత చిత్రంలా కనిపించినా.. ఫుల్ లెంగ్త్ కామెడీతో తెరకెక్కి, తెలుగు ప్రేక్షకులను పండుగ వేళ నవ్వించే వినోదభరిత చిత్రం

చివరగా... సంక్రాంతి వేళ సరదాగా చడదగ్గ వినోదభరిత చిత్రం

Posted: January 12, 2019, 6:53 am
‘వినయ విధేయ రామ’

విశ్లేషణ

బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా అన‌గానే ఓ అంద‌మైన కుటుంబం, అంత‌కు మించి హింస ఉన్న యాక్ష‌న్ ఎపిసోడ్స్ గురించి ఆలోచించ‌క్క‌ర్లేదు. అవి రెండూ పుష్క‌లంగా ఉన్న సినిమా `విన‌య విధేయ రామ‌`. న‌లుగురు అనాథ‌లు క‌లిసి పెంచుకున్న మ‌రో అనాథ రామ్‌. సొంతంగా ఆసుప‌త్రి ఉన్న డాక్ట‌ర్ వీరికి ఆశ్ర‌య‌మిస్తాడు. కొన్నేళ్ల పాటు న‌లుగురు అన్న‌ద‌మ్ములూ క‌లిసి త‌మ్ముడిని చదివించుకుంటారు. కానీ ఒక సంద‌ర్భంలో త‌మ్ముడు త‌న అన్న‌ల‌కు అండ‌గా నిల‌బ‌డి వాళ్ల‌ని చ‌దివిస్తాడు.

అయితే ఈ మొత్తం చిత్రంలో మెచ్చుకోవాల్సిన విష‌యం హీరోయిజం. త‌న హీరో బ‌లాన్ని బాగా వాడుకున్నాడు ద‌ర్శ‌కుడు. యాక్ష‌న్ ఎపిసోడ్స్ చేయ‌డానికి, భీభ‌త్సాన్ని తెర‌మీద ఓ స్థాయిలో చూపించ‌డానికి బోయ‌పాటి ఘ‌నాపాటి అనే విష‌యం ఈ చిత్రం ద్వారా మ‌రో సారి రుజువైంది. రాంచ‌ర‌ణ్ హీరోయిజం అడుగ‌డుగునా ఎలివేట్ అయింది. మొత్తానికి మాస్ హీరోగా రాంచరణ్ ను చూపించాలన్న ఆసక్తిగత బోయపాటి హింసాను మాత్రం అమాంతం పెంచేశాడని అనిపించక తప్పదు.

నటీనటుల విషాయానికి వస్తే..

ర‌ంగ‌స్థ‌లం త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్ ఇందులో ఒక ఎగ్రెసివ్ పాత్ర చేశాడు. రామ్ పాత్ర‌లో చాలా షేడ్స్ ఉంటాయి. ఫ్యామిలీ డ్రామా, ల‌వ్‌, ఫ‌న్‌, ఒక ఫైట‌ర్ ఇలా అనేక కోణాల్లో సాగుతుంది. అన్నింటిక‌న్నా ఫైట‌ర్ మాత్ర‌మే ఎలివేట్ అయ్యాడు. సిక్స్‌ప్యాక్ చేసి రామ్ చేసిన యాక్ష‌న్ స‌న్నివేశాలు అభిమానుల‌కు నచ్చుతాయి. కియారా అడ్వాణీ అందంగా క‌నిపించింది. అయితే, ఆమె పాత్ర‌కు అంత‌గా ప్రాధాన్యం లేదు. అన్న‌ద‌మ్ములుగా న‌టించిన ప్ర‌శాంత్‌, ఆర్య‌న్‌ రాజేష్‌, మ‌ధునంద‌న్‌, ర‌వివ‌ర్మ‌ తమ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

ముఖ్యంగా ప్ర‌శాంత్‌కు ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. ఆర్య‌న్ రాజేష్ కూడా ఆక‌ట్టుకుంటాడు. ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో న‌టించిన వివేక్ ఒబెరాయ్ త‌న‌దైన శైలిలో బాగా న‌టించాడు. రామ్‌-వివేక్ పోరాట స‌న్నివేశాలు రోమాంచితంగా ఉంటాయి. బాలీవుడ్ నుంచి వివేక్‌ను తీసుకొచ్చినందుకు త‌న పాత్ర‌కు న్యాయం చేశాడు. సినిమాలోని కొన్ని స‌న్నివేశాల్లో విల‌న్‌ డామినేష‌న్ క‌న‌ప‌డ‌టం బోయ‌పాటి స్టైల్‌. అదే ఈ సినిమాలోనూ కొన‌సాగింది.

{youtube}v=aV5HMqRas5g|620|400|1{/youtube}

టెక్నికల్ అంశాలకు వస్తే..

సినిమాలో నిర్మాణ పరంగా బాగుంది. సినిమా అద్యంతం రిచ్ గా వుంది. నిర్మాత పెట్టిన ఖ‌ర్చు తెర‌మీద భారీగా క‌నిపించింది. ప్ర‌తి ఫ్రేమూ నిండుగా క‌నిపించింది. దేవిశ్రీ ప్ర‌సాద్ పాట‌లు సినిమాకు ప్లస్ పాయింట్. పాటలు మాస్‌ అడియన్స్ కు న‌చ్చేలా ఉన్నాయి. పాట‌ల్లో సాహిత్యం, బీట్ క‌న్నా రాంచ‌ర‌ణ్ స్టెప్‌లు అభిమానుల‌ను మెప్పిస్తాయి. రంగ‌స్థలంలో పెద్ద‌గా స్టెప్‌లు వేసే అవ‌కాశం రాని చెర్రీ ఇందులో ఆ లోటు తీర్చుకున్నాడు.

సంభాష‌ణ‌ల్లో ప‌దునుంది. రామ్ కొ..ణి..దె..ల‌.. అంటూ చెప్పే డైలాగ్‌లు మాస్ కు బాగా న‌చ్చుతాయి. క‌థ‌కుడిగా బోయ‌పాటి.. రామ్ కు స‌రిపోయే క‌థ‌ను మాత్రం ఎంచుకోలేక‌పోయాడ‌ు అని అనిపిస్తుంది. కెమెరాప‌నిత‌నం, లొకేష‌న్లు, సెట్లు, కాస్ట్యూమ్స్, హార్స్ ఎపిసోడ్‌, న‌టీన‌టుల న‌ట‌న సినిమాకు అదనపు అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. సినిమా మొత్తం క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో మాస్ అడియన్స్ ను టార్గెట్ చేసి తీసినట్లుగా వుంది.

 

తీర్పు..

మాస్ సినిమాల దర్శకుడి మరో మాస్ చిత్రం.. మాస్ హీరోగా రాంచరణ్ ను ఎలివేట్ చేయడంలో హింసకు అధిక ప్రాధాన్యమిచ్చి చిత్రం వినయ విధేయ రామ..చరణ్ అభిమానులకు పండగ విందు..

చివరగా... మాస్ ఇమేజ్ తో అడియన్స్ ను అకట్టుకునే బోయపాటి చిత్రం..

Posted: January 11, 2019, 10:09 am
‘పేట’

విశ్లేషణ

ర‌జ‌నీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు వుండటానికి ఆయన స్టైల్‌, ఎన‌ర్జీ, మేనరిజం ఒక కారణమం. అదే స్టైల్, మేనరిజం, ఎనర్జీతో రజనీ నటించిన తాజాచిత్రం పేట. ‘క‌బాలి’, ‘కాలా’, ‘2.ఓ’ చిత్రాలు ర‌జ‌నీలో ఉన్న మేన‌రిజాన్ని, స్టైల్ తెరపై చూపించలేదు. అందుకు ఆయా క‌థ‌లు, హీరో బ్యాక్ డ్రాప్ కూడా కారణాలు. అయితే, చాలా కాలం త‌ర్వాత ర‌జ‌నీ త‌న స్టైల్, మేనరిజాలను చూపించుకోవ‌డానికి, త‌న ఛ‌రిష్మా చూపించిన తాజా చిత్రం పేట.

దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు రజనీ స్టైల్, మేనరిజంతో పాటు ఆయన ఎనర్జీని కూడా ఫుల్ లెంగ్త్ లో వాడుకోవ‌డానికి ఇలాంటి క‌థ‌ను ఎంచుకున్నాడా.? అని అనిపిస్తోంది. న‌వ‌త‌రం ప్ర‌తిభావంతులైన ద‌ర్శ‌కుల్లో కార్తీక్ సుబ్బ‌రాజు ఒక‌డు. త‌న క‌థ‌ల్లో చిన్న గ‌మ్మ‌త్తు ఉంటుంది. కాక‌పోతే అత‌ను కూడా ర‌జ‌నీ స్టైల్ ను ఫాలో అయిపోతూ, ర‌జ‌నీ సినిమాకు కావాల్సిన క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో క‌థ‌ను త‌యారు చేసుకున్నాడు. తొలి స‌న్నివేశాలు, ర‌జ‌నీ ప‌రిచ‌య దృశ్యాలు, హాస్ట‌ల్ లో జ‌రిగే సంఘ‌ట‌న‌లతో రజనీని వాడేసుకుని అభిమానుల‌ను మెప్పించాడు కార్తీక్ సుబ్బరాజు.

ఈ చిత్రంలోని ఫైటింగ్ సన్నివేశాలు కూడా అలాగే స్టైల్ గా చిత్రీకరించాడు కార్తీక్. సిమ్ర‌న్‌ తో జ‌రిగే ట్రాక్ మొత్తం వింటేజ్ ర‌జ‌నీకాంత్ ను మ‌న‌కు చూపిస్తుంది. విరామ స‌న్నివేశాల వ‌ర‌కూ ఇసుమంత క‌థ కూడా ద‌ర్శ‌కుడు చెప్ప‌లేదు. కేవ‌లం ర‌జ‌నీ అభిమానుల‌ను మెప్పించ‌డానికే స‌న్నివేశాల‌ను అల్లుకుంటూ వెళ్లాడు. ఇదే ఆయన అభిమానులను ధియేటర్లకు రప్పిస్తుందన్న బలమైన నమ్మకంతోనే కార్తీక్ సుబ్బరాజు ఈ ప్రయత్నం చేశాడు.

ద్వితీయార్ధంలో రజనీ ప్లాష్ బ్యాక్ కథ.. రజనీ కాంత్ పేట నుంచి కాళీగా మారడానికి కారణమైన కథ.అయితే దానిని కూడా క‌మ‌ర్షియ‌ల్ స‌న్నివేశాల‌తో న‌డిపించాడు. మొత్తంగా చూస్తే ఇదో రివేంజ్ డ్రామా. తొలి స‌గంలో ర‌జ‌నీ మేన‌రిజ‌మ్స్‌, స్టైల్‌పై ఆధార‌ప‌డిన ద‌ర్శ‌కుడు, సెకండాఫ్ మొత్తాన్ని ఫ్లాష్‌బ్యాక్‌, త‌ను తీర్చుకునే ప‌గ‌తోనూ పూర్తి చేశాడు. బ‌ల‌మైన ఫ్లాష్ బ్యాక్ ఉంటే ఇలాంటి క‌థ‌లు అదిరిపోతాయి. కానీ, అదే ఈ సినిమాకు కాస్త లోపంగా మారింది.

కార్తీక్ సుబ్బ‌రాజు ఈ క‌థ‌ను ఎందుకు ర‌జ‌నీ ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లాడు? ర‌జ‌నీ ఎందుకు ఒకే చెప్పారో అర్థం కాదు కానీ, ఇది అంద‌రికీ తెలిసిన క‌థే. ఫ్లాష్‌బ్యాక్ ర‌క్తిక‌ట్టి ఉంటే, ఈ సినిమా మ‌రో రేంజ్‌లో ఉండేది. ఇటీవ‌ల కాలంలో ర‌జ‌నీని ర‌జ‌నీలా చూడ‌లేక‌పోయామ‌ని నిరాశ ప‌డుతున్న అభిమానుల‌కు మాత్రం ఇది ఫుల్‌మీల్స్‌. పాట‌లు క‌థ గ‌మ‌నానికి స్పీడ్ బ్రేక‌ర్స్‌లా ఉన్నాయేమో అనిపిస్తుంది. అందులో కూడా ర‌జ‌నీ స్టైల్‌ను చూసి మురిసిపోవ‌డం త‌ప్ప ఆ పాట‌ల వ‌ల్ల సినిమాకు వ‌చ్చిన అద‌న‌పు బ‌లం ఏమీ ఉండ‌దు.

నటీనటుల విషానికి వస్తే

ఫుల్ ఎన‌ర్జీతో ఈ సినిమాలో రజనీకాంత్ న‌టించారు. ఇలాంటి పాత్ర‌లు చేయ‌డం వెన్న‌తో పెట్టిన విద్య‌. ఆయ‌న్ను అభిమానులు ఎలా చూడాల‌ని అనుకుంటున్నార‌ో  బాగా తెలిసిన‌.. అభిమానిగా, ద‌ర్శ‌కుడిగా కార్తీక్ సుబ్బ‌రాజ్ సినిమాను చ‌క్క‌గా తెర‌కెక్కించాడు. కబాలి, కాలా సినిమాల్లో క‌న‌ప‌డ‌ని ఓ ఎన‌ర్జీ ఈ సినిమాలో ర‌జ‌నీకాంత్‌లో చూస్తారు. అలాగే ఆయ‌న గ‌త చిత్రాల‌తో పోల్చితే వ‌య‌సును మించి క‌ష్ట‌ప‌డి డ్యాన్సులు కూడా వేశారు. త‌న‌లోని న‌టుడిని స‌వాల్ చేసే స‌న్నివేశం ఈ చిత్రంలో ఒక్క‌టి కూడా క‌నిపించ‌దు.

చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్లిపోయాడు. కుర్రాడిలా ర‌జ‌నీకాంత్ ఇచ్చే హావ‌భావాలు కాస్త ఎంట‌ర్‌టైన్ చేస్తాయి. ఈ వ‌య‌సులోనూ అంత జోరుగా న‌టించ‌డం కేవ‌లం ర‌జ‌నీ వ‌ల్ల మాత్ర‌మే అవుతుంది. ఇక కామెడీ టైమింగ్‌లో ర‌జనీకాంత్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ర‌జ‌నీకాంత్‌, సిమ్రాన్ ట్రాక్ మెప్పిస్తుంది. ఇక నవాజుద్దీన్ సిద్దిఖీ, విజయసేతుపతి లాంటి నటులు కూడా తమ పాత్రలలో స్తాయికి తగ్గట్టుగా నటించి మెప్పించారు.

{youtube}v=BJz84-eynJc|620|400|1{/youtube}

టెక్నికల్ అంశాలకు వస్తే..

సాంకేతికంగా సినిమా ఫర్వాలేదనిపిస్తోంది. త‌న‌దైన నేప‌థ్య సంగీతంతో అనిరుధ్ హోరెత్తించాడు. ర‌జ‌నీని అభిమానులు ఎలా చూడాల‌నుకుంటున్నారో అలా చూడ‌టానికి అనిరుధ్ ఇచ్చిన బీజీఎమ్స్ చ‌క్క‌గా స‌రిపోయాయి. తిరు సినిమాట్రోగ‌ఫ్రీ చాలా బాగుంది. సాంకేతికంగా ర‌జ‌నీ సినిమాల స్థాయిలోనే పేట కూడా ఉంది. కొన్ని సంభాష‌ణ‌లు గ‌మ్మ‌త్తుగా అనిపిస్తాయి.

 

తీర్పు..

రజనీకాంత్ అభిమానిగా, అభిమానులు ఆయనను ఎలా చూడాలని అనుకుంటున్నారో అలా సినిమాను తీర్చిదిద్దినా.. ద్వితీయార్థంలో మాత్రం స్లో నరేషన్ కారణంగా సినిమా కొంత లాగ్ చేసినట్లు అనిపిస్తుంది. పొంగల్ వేళ.. రజీనీ అభిమానులకు అదనపు పండగ

చివరగా... పేట.. రజనీకాంత్ అభిమానులకు పండగ విందు..

Posted: January 10, 2019, 1:21 pm
‘ఎన్టీఆర్ కథానాయకుడు’

విశ్లేషణ

ఎన్టీఆర్ జీవితంలో ఏం చూడాల‌నుకుంటున్నారో.. ఏం తెలుసుకోవాల‌నుకుంటారో.. అవ‌న్నీ తెర‌పై చూపించాడు ద‌ర్శ‌కుడు. ఎన్టీఆర్ సినిమా రంగ ప్ర‌వేశం చేసిన త‌ర్వాత ఆయ‌న పోషించిన పాత్ర‌ల‌న్నీ ప్ర‌తి ఐదు నిమిషాల‌కోసారి మ‌న‌కు ద‌ర్శ‌న‌మిస్తాయి. అదంతా పండ‌గ‌లా ఉంటుంది. ఆయా పాత్ర‌ల్లో బాల‌కృష్ణ అభిమానుల‌ను అల‌రిస్తారు. ద‌ర్శ‌కుడు ఈ సినిమాలో ఎమోష‌న‌ల్ స‌న్నివేశాల‌పై ఎక్కువ దృష్టిపెట్టాడు. ఎన్టీఆర్‌-బ‌స‌వ‌తారకం మ‌ధ్య ఉన్న అనుబంధం చూసి ఆశ్చ‌ర్య‌పోతారు.

ఒక భ‌ర్త‌.. భార్యకు ఇంత‌లా ప్రాధాన్యం ఇస్తారా? అనిపిస్తుంది. ఎన్టీఆర్ జీవితంలో చోటు చేసుకున్న ప్ర‌తి మ‌లుపు క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించాడు ద‌ర్శ‌కుడు. మనదేశం, రైతుబిడ్డ చిత్రాల్లో ఎన్టీఆర్‌కు ఎలా అవకాశం వచ్చింది? తోటరాముడి పాత్ర ఎలా దక్కింది. కృష్ణుడిగా ఎన్టీఆర్‌ కనిపించినప్పుడు ఎదురైన సంఘటనలను దర్శకుడు చాలా చక్కగా చూపించాడు. కొన్ని స‌న్నివేశాలు రోమాలు నిక్క‌బొడిచేలా ఉంటాయి. కుటుంబమా? సినిమానా? ఏది ముఖ్యం అంటే ‘నాకు సినిమానే ముఖ్య‌మ‌’ని ప్రారంభ స‌న్నివేశాల్లో ఎందుకు ఎన్టీఆర్ చెప్పార‌నే దానికి స‌మాధానం విరామానికి ముందు తెలుస్తుంది.

త‌న‌యుడు చావుబ‌తుకుల్లో ఉన్నా స‌రే నిర్మాత న‌ష్ట‌పోకూడ‌ద‌న్న ఉద్దేశంతో షూటింగ్‌కు వ‌చ్చిన ఒక మ‌హాన‌టుడిని తెర‌పై చూస్తాం. ఎన్టీఆర్ రాజ‌కీయాల్లో ఎందుకు రావాల‌ని అనుకుంటున్నాడు.. అందుకు ప్రేరేపించిన అంశాలు ఏంటి? క‌థానాయ‌కుడి జీవితం నుంచి రాజ‌కీయ నాయ‌కుడిగా ఎలా ఎద‌గాల‌ని అనుకున్నాడ‌ది ప్రీక్లైమాక్స్‌లో క‌నిపిస్తుంది. దివిసీమ ఉప్పెన నేప‌థ్యాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు, గుండెల‌ను మెలి తిప్పేలా చూపించాడు ద‌ర్శ‌కుడు. అభిమానుల‌కు తెలిసిన విషయాలు, తెలియ‌ని విష‌యాలు అత్యంత నాట‌కీయంగా, స‌హ‌జంగా ద‌ర్శ‌కుడు తెర‌పైకి తీసుకొచ్చాడు.

నటీనటుల విషానికి వస్తే

ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర‌ను తెర‌పై చూపించ‌డం అనుకున్నంత సుల‌భం కాదు. ఎందుకంటే ప్ర‌తి పాత్ర‌కు ఒక ఔచిత్యం ఉంది. దానికి త‌గిన న‌టీన‌టుల‌ను ఎంచుకోవాలి. ఆ విష‌యంలో ద‌ర్శ‌కుడు క్రిష్‌, అత‌ని బృందం నూటికి నూరుపాళ్లు విజ‌యం సాధించింది. ప్ర‌తి పాత్రా పోత పోసిన‌ట్లే అనిపిస్తుంది. చాలా పాత్ర‌లు కేవ‌లం ఒక్క స‌న్నివేశానికి మాత్ర‌మే ప‌రిమిత‌మైన‌వే. అయినా, అలాంటి స‌న్నివేశాలు కూడా ర‌క్తిక‌ట్టాయి. ఎన్టీఆర్ గా బాల‌కృష్ణ‌.. ఎన్నో విభిన్న గెట‌ప్పుల్లో క‌నిపించారు.

ప్ర‌తి రూపానికి ఒక ప్ర‌త్యేక‌త ఉంది. ముఖ్యంగా పౌరాణికానికి సంబంధించిన చిత్రాల్లో ఆయన ధరించిన కృష్ణుడు, వెంక‌టేశ్వ‌ర‌స్వామి పాత్ర‌ల్లో బాల‌కృష్ణని చూసినా.. అన్నగారిని తలచుకోని తెలుగువాడు వుండడు. ఇప్పటికీ ఎన్టీఆర్ వేసిన కృష్ణుడు, రాముడు, వెంకటేశ్వరుడి చిత్రపటాలకు నిజమైన దేవుళ్లగానే పూజలు చేసే అభిమానులు వున్నారంటే అతిశయోక్తి కాదు. బ‌స‌వ‌తార‌కంగా విద్యాబాల‌న్ ఈ సినిమాకు ప్రాణం పోశారు. ఆమెను ఎంచుకోవ‌డ‌మే ఈ సినిమాకు ప్ర‌ధాన బ‌లం.

ఆత‌ర్వాత అభిమానుల‌ను ఎక్కువ‌గా ఆక‌ట్టుకునేది అక్కినేని నాగేశ్వ‌ర‌రావు పాత్ర‌. అక్కినేనిగా సుమంత్ చాలా చ‌క్క‌గా క‌నిపించారు. కొన్ని స‌న్నివేశాల్లో నిజంగా ఏయ‌న్నారేమోన‌నిపించినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. ఎన్టీఆర్‌-ఏయ‌న్నార్‌ల అనుబంధాన్ని కూడా తెరపై అందంగా ఆవిష్క‌రించారు. ఒక రకంగా ఏయ‌న్నార్ బ‌యోపిక్‌లా కూడా అనిపిస్తుంది. సినిమాలో ఎక్కువ సన్నివేశాల్లో కనిపించే మరో ముఖ్యమైన పాత్ర త్రివిక్రమరావు. ఆ పాత్రలో దగ్గుబాటి రాజా చక్కగా నటించారు. చంద్ర‌బాబుగా రానా పాత్ర చివ‌రిలో త‌ళుక్కున మెరుస్తుంది.

{youtube}v=1-2J7avI9W8|620|400|1{/youtube}

టెక్నికల్ అంశాలకు వస్తే..

ఈ సినిమా అత్యున్న‌తంగా ఉంటుంది. ద‌ర్శ‌కుడు క్రిష్ ప్ర‌తిభ‌ను మెచ్చుకోక త‌ప్ప‌దు. అభిమానుల‌కు ఏం కావాలో అవ‌న్నీ చూపించ‌గ‌లిగారు. ఎన్టీఆర్ చ‌రిత్ర ఒక పాఠంలా మిగిలిపోయేలా ఈ సినిమా ఉంటుంది. ఎం.ఎం. కీర‌వాణి అందించిన పాట‌లు, నేప‌థ్య సంగీతం సినిమాకు ప్ర‌ధాన బ‌లం. జ్ఞాన శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. ప్ర‌తి ఫ్రేమూ చాలా అందంగా చూపించారు. అన్నింటిక‌న్నా బుర్రా సాయిమాధ‌వ్ రాసిన సంభాష‌ణ‌లు ఆయువుప‌ట్టు. ప్ర‌తి స‌న్నివేశంలో ఒక మెరుపులాంటి సంభాష‌ణ ఉంటుంది.

ఎన్టీఆర్ ఉద్యోగం కోసం వెళ్లిన‌ప్పుడు లంచం అడిగితే ఎవ‌డి ఇంటికి వాడు య‌జ‌మాని. లంచం తీసుకునేవాడి ఇంటికి ఎంత‌మంది య‌జ‌మానులు అన్న డైలాగ్ చ‌ప్ప‌ట్లు కొట్టిస్తుంది. మొత్తం చూస్తే, అటు న‌టీన‌టులు, ఇటు సాంకేతిక నిపుణులు చేసిన అద్భుత ప్ర‌య‌త్నం య‌న్‌.టి.ఆర్. కెమెరామన్ పాత్ర కూడా చాలా కీలకం. ఆ పాత్రకు నిరవ్ పూర్తి న్యాయం చేశారు. సినిమాను సాగదీయకుండా ఎడిటర్ ఆంటొని బాగా ఎడిట్ చేశారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

తీర్పు..

తెలుగు వారి ఆరాధ్యుడి గొప్ప‌తనాన్ని, ఆత్మ‌గౌర‌వాన్ని ఎలుగెత్తి చాటిన చిత్రం.. ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదు.. తరతరాల తెలుగువారికి ఒక దిక్సూచీ, ఒక స్పూర్తి, ఒక మార్గదర్శి. భావి త‌రాల‌కు ఆయన జీవిత విశేషాలను అందించే ప్ర‌య‌త్నం బాగుంది.

చివరగా... భావితరాలకు మహానుభావుడి జీవిత పాఠం....

Posted: January 9, 2019, 1:28 pm
‘రోబో 2.0’

విశ్లేషణ

‘2.0’ ఓ విజువల్ వండర్. విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్, 3డి విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇన్నీ వున్నా ప్రేక్షకుడిని కట్టిపడేసే కమర్షియల్ ఎలిమెంట్స్, ఎమోషన్స్ మాత్రం లేవు. ‘రోబో’లో చూపించిన ఆ కమర్షియల్ అంశాలకు శంకర్ ఈ చిత్రంలో అంత ప్రాధాన్యం ఇవ్వలేదు. తన దృష్టినంతా కేవలం విజువల్ ఎఫెక్ట్స్ పైనే పెట్టారు. సినిమా మొత్తం కేవలం యాక్షన్‌ థ్రిల్లర్ తో నింపేశారు. పక్షిరాజా గతాన్ని ఎమోషన్ అద్దే విషయాన్ని కూడా మర్చిపోయాడా.? అన్నట్లు గా వుంది. అయితే విజువల్‌గా మాత్రం ‘2.0’ అద్భుతమనే చెప్పాలి.

స్టోరీ లైన్ చాలా సింపుల్ గా ఉన్న కథనాన్ని మాత్రం శంకర్ తనదైన శైలిలో నడిపించారు. తొలిభాగలో సెల్ ఫోన్లన్నీ ఆకాశంలోకి ఎగిరిపోవడం, కొంత మందిని సెల్‌ఫోన్ల సాయంతో కంటికి కనిపించని శక్తి అంతమొందించడం వంటి సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఆ శక్తి ఏంటో కనిపెట్టడానికి తన రోబో అసిస్టెంట్ వెన్నెల (అమీ జాక్సన్) సాయంతో వసీకరన్ చేసే పరిశోధనలు, ఆత్మహత్య చేసుకున్న వ్యక్తే ఆ శక్తి అని తెలుసుకోవడం, దాన్ని అడ్డుకోవడానికి ఏం చేయాలి అనే అంశాలతో తొలి భాగం ముగుస్తుంది. పాటలు, అనవసరపు సన్నివేశాలు లేకపోవడం వల్ల ఫస్టాఫ్ బోరింగ్ గా అనిపించదు.

ఇక మలిభాగంలో పక్షిరాజా పరిచయం, ఆయన గతం, ఆయనతో చిట్టి పోరాటాలను చూపించారు. సెకండాఫ్ లో మొత్తం కంప్యూటర్ సృష్టే. రోబో వర్షన్ 2.0తో పాటు చిన్ని అనే మైక్రోరోబోలను కూడా శంకర్ పరిచయం చేశారు. రజినీ స్టైల్లో రోబో పోరాట సన్నివేశాలు, రోబోగా ఆయన నటన ఆకట్టుకుంటాయి. ఇక ఆఖరి 30 నిమిషాల పోరాట సన్నివేశాలైతే ప్రేక్షకుడికి ఆశ్చర్యానికి గురిచేస్తాయి. వసీకరన్ లోకి ప్రవేశించిన పక్షిరాజాను రోబో వర్షన్ 2.0 ఎదుర్కొన్న సన్నివేశాలు అద్భుతం. ముఖ్యంగా 3డిలో చూసే ప్రేక్షకుడు కొత్త అనుభూతిని పొందుతాడు. పావురాలపై మైక్రో రోబోలు ఎగురుకుంటూ రావడం కొత్తగా అనిపిస్తుంది.

నటీనటుల విషానికి వస్తే

ఈ సినిమాలో నటనకు పెద్దగా ప్రాధాన్యం లేదనే చెప్పాలి. అక్షయ్ కుమార్ పాత్రకు మాత్రమే కాస్త ఎక్కువ స్కోప్ ఉంది. వృద్ధుడిగా, మనుషులను చంపే క్రూరమైన పక్షిగా అక్షయ్ నటన చాలా బాగుంది. ఇక ఎప్పటిలానే రజినీకాంత్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా రోబో పాత్రలో తన స్టైల్ చమత్కారాలతో నవ్వించారు. అమీ జాక్సన్ హ్యూమనాయిడ్ రోబోగా బాగా నటించింది. అదిల్ హుస్సేన్, కళాభవన్ షాజన్, సుధాన్షు పాండే తమ పాత్రల పరిధి మేర నటించారు.

{youtube}v=QDKY8CRe1-0|620|400|1{/youtube}

టెక్నికల్ అంశాలకు వస్తే..

సాంకేతికంగా ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ‘రోబో’ సినిమాతోనే భారతీయ సినిమాను శంకర్ మరో స్థాయికి తీసుకెళ్లారు. ఇప్పుడు ఈ ‘2.0’తో దాన్ని మరింత పెంచే ప్రయత్నం చేశారు. అంతర్జాతీయ స్థాయి విజువల్స్, యానిమేషన్, ఎఫెక్ట్స్‌తో అద్భుతమైన ఔట్‌పుట్‌ను అందించారు. ఈ సినిమాను 3డిలో చూసే ప్రేక్షకుడు టైటిల్స్‌ చూసినప్పుడే ‘వావ్’ అనకమానడు. శంకర్ తరవాత చెప్పుకోవాల్సిన అంశం చిత్ర సంగీతం గురించే. ఎఆర్ రహమాన్ సంగీతానికి ఈ చిత్రంలో ఫుల్ మార్క్స్ పడ్డాయి.

కుతుబ్-ఇ-కృపతో కలిసి ఆయన చేసిన రీరికార్డింగ్ అదిరిపోయింది. ముఖ్యంగా పోరాట సన్నివేశాల్లో సౌండ్ టెక్నాలజీ కొత్త అనుభూతిని ఇస్తుంది. నిరవ్ షా సినిమాటోగ్రఫీ మరో ప్లస్. ఇలాంటి సినిమాలను చిత్రీకరించడంలో కెమెరామన్ పాత్ర కూడా చాలా కీలకం. ఆ పాత్రకు నిరవ్ పూర్తి న్యాయం చేశారు. సినిమాను సాగదీయకుండా ఎడిటర్ ఆంటొని బాగా ఎడిట్ చేశారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

తీర్పు..

సెల్ టవర్స్ విచ్చలవిడిగా ఏర్పాటు చేయడంతో పక్షుల అంతమవుతున్నాయని, ఇది క్రమేనా మనిషి జాతిని కూడా అంతం చేస్తుందన్న సందేశాత్మక చిత్రమిది. అయితే ఆ మెసేజ్ ను బలంగా చెప్పడం కన్నా విజువల్ గా చూపించే ప్రయత్నం బాగుంది. మొత్తంగా ఈ సినిమా ఒక విజువల్ వండర్..!

చివరగా... అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ చిత్రం....

Posted: November 29, 2018, 1:14 pm
‘సర్కార్’

విశ్లేషణ

మురుగదాస్‌ కథలన్నీ ఒక సామాజిక నేపథ్యం కలిగి కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో ఉంటాయి. ఈ సినిమాలో కూడా అదే పంథాను అనుసరించాడు. విజయ్‌ అభిమానులకు ఏమేమి కావాలో అవన్నీ సినిమాలో పెట్టాడు. తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా, అర్థమయ్యేలాగా చెప్పేశాడు. ఒక ఓటును ఎవరైనా దొంగతనంగా వేసేస్తే ఆ హక్కును తిరిగి సంపాదించుకోవచ్చనేది చాలా మందికి తెలియదు. రాజ్యాంగ పరిభాషలో ఆ చట్టాలన్నీ సామాన్యులకు అర్థంకావు.

అయితే, సామాన్య ఓటర్లుకు తమ ఓటు హక్కును ఎలా సంపాదించుకోవాలన్న విషయాన్ని అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్లు ఈజీగా చెప్పగలిగాడు దర్శకుడు. అసలు ఇవన్నీ బయట ప్రపంచంలో జరుగుతాయా? లేదా? ఒక బలమైన రాజకీయ ప్రత్యర్థి.. 50 ఏళ్లుగా రాష్ట్రాన్ని ఏలుతున్న సీఎంను ఒక కార్పొరేట్‌ మేధావి ఎదిరించగలడా? ఎదిరించి ఎలా నిలబడ్డాడు అన్న విషయాన్ని ప్రేక్షకులు దృష్టి మరల్చకుండా తన దర్శకత్వ ప్రతిభతో చూపించి మెప్పు పొందగలిగాడు మురగదాస్.

కథ మొదటి సన్నివేశం నుంచి దర్శకుడు కథలోకి వెళ్లిపోయాడు. కాబట్టి, ప్రేక్షకులు సులభంగా సినిమాలో లీనమవుతారు. తన ఓటు కోసం విజయ్‌ చేసే ప్రయత్నాలన్నీ ఆకట్టుకునేలా ఉన్నాయి. పాట, ఫైట్‌ అనే కమర్షియల్‌ సూత్రాన్ని ఎక్కడా విస్మరించలేదు. విజయ్‌ సినిమాల్లో ఉండే వాణిజ్య హంగులను ఎక్కడికక్కడ జాగ్రత్తగా పేర్చుకుంటూ వెళ్లాడు. ద్వితీయార్ధం మొత్తం రాజకీయాల చుట్టూనే తిరుగుతుంది. సుందర్‌ ఏం చేస్తాడా? ఎలా గెలుస్తాడా? అని ఉత్కంఠభరింతంగా చూపించాడు. పాప (వరలక్ష్మి) పాత్ర ఎంట్రీతో కథ మరింత మలుపు తిరుగుతుంది.

బలమైన ప్రత్యర్థి ఉండటంతో కథానాయకుడు ప్రతినాయిక మధ్య సన్నివేశాలు రసవత్తరంగా సాగుతాయి. అయితే మురుగదాస్‌ ఈ సినిమాకు కాస్త లిబర్టీ ఎక్కువ తీసుకున్నాడు. లాజిక్‌కి అందని విషయాలు చాలా ఉంటాయి. కానీ, తన టేకింగ్‌తో అవన్నీ మర్చిపోయేలా ఒక సంక్లిష్టమైన సినిమాను ఒక పక్కా కమర్షియల్‌ సినిమాగా తీర్చిదిద్దాడు. కొన్ని సన్నివేశాలు తమిళనాట రాజకీయాలను ప్రతిబింబిస్తాయి. ఓట్లను అమ్ముకోవడం, ఉచిత పథకాలకు లొంగిపోవడం వంటి అంశాలపై దర్శకుడు సెటైర్లు వేయగలిగాడు. ఆస్పత్రి రాజకీయాలు కూడా తెరపై కనిపిస్తాయి.

నటీనటుల విషానికి వస్తే

విజయ్ కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. తన అభిమానులను మరోసారి మెస్మరైజ్‌ చేయగలిగాడు. పొలిటికల్‌ డైలాగ్‌లు చెప్పేటప్పుడు విజయ్‌ హావభావాలు ఆకట్టుకుంటాయి. ఓ ఎమ్.ఎల్.ఏ కూతురి పాత్రలో నటించిన హీరోయిన్ కీర్తి సురేష్ కి పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రే. మరో రకంగా చెప్పాలంటే అమెది ఈ సినిమాలో అతిధి పాత్రగానే వుంది. అయితే ఉన్నంతలో తన పాత్ర పరిధి మేరకు ఆమె బాగానే నటించింది.

సినిమాలో మరో కీలక పాత్రలో, ప్రతినాయకురాలి పాత్రను పోషించిన వరలక్ష్మి శరత్ కుమార్ యువ రాజకీయ నాయకురాలిగా తన నటనతో కట్టిపడేస్తోంది. తన రాకతో విజయ్ కు ఒక సమఉజ్జీగా నిలబడిన పాత్ర ఒకటి కనిపిస్తుంది. ఇక ఎప్పటిలాగే రాధా రవి తన నటనతో మరియు తన మార్క్ హావభావాలతో ఆకట్టుకోగా… కమెడియన్ యోగి బాబు తాను ఉన్న రెండు మూడు సీన్స్ లో నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు.

{youtube}JsE4qInfmZ0|620|400|1{/youtube}

టెక్నికల్ అంశాలకు వస్తే..

సాంకేతికంగా సినిమా చాలా రిచ్ గా వుంది. నిర్మాణ విలువలు ఉన్నతస్థాయిలో వున్నాయి. దర్శకుడు మురగదాస్ రాజకీయాలకు సంబంధించి, ఓటుకు సంబంధించి మంచి స్టోరీ లైన్ తీసుకున్నప్పటికీ.. ఆ స్టోరీ లైన్ కి తగ్గట్లు కథాకథనాలను మాత్రం ఆయన ఆసక్తికరంగా రాసుకోలేదు, కానీ కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో మరియు కొన్ని పొలిటికల్ సన్నివేశాల్లో ఆయన తన మార్క్ డైరెక్షన్ తో కూడా ఆయన ఆకట్టుకున్నారు. ఏ ఆర్ రహమాన్ అందించిన సంగీతం ఆయన స్థాయికి తగ్గట్లు లేదనిపించింది.

అయితే కొన్ని కీలక సన్నివేశాలతో పాటు నేపథ్య సంగీతం అకట్టుకుంది. కానీ పాటలు మాత్రం ప్రేక్షకాదరణ పోందేలా లేవు. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఆయన ఎంతో రియలిస్టిక్ గా చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. ఇక ఫైటింగ్ సన్నివేశాల చిత్రీకరణలో కెమెరా పనితనం చక్కగా అకట్టుకుంది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాగున్నప్పటికీ, సినిమాలోని లాజిక్ లేని సన్నివేశాలకు క్లారిటీ ఇచ్చే సీన్స్ ని కూడా ఉంచి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది.

తీర్పు..

సామాన్య ప్రజలకు ఓటు హక్కును, దాని విలువను.. కమర్సియల్ ఎలిమెంట్స్ జోడించి అర్థమయ్యేలా చేసిన చిత్రం

చివరగా... ఓటు హక్కు విలువను చాటిన రాజకీయ చిత్రం..

Posted: November 6, 2018, 11:24 am
‘హలో గురు ప్రేమకోసమే’

విశ్లేషణ

తన కుమార్తెను ఒక అబ్బాయి ప్రేమించాడని తెలిసిన తర్వాత ప్రతి తండ్రి... ఒక తండ్రి స్థానంలో కాకుండా ప్రేమించిన అబ్బాయి స్నేహితుడు స్థానంలో వుండి ఆలోచిస్తే ఎలా వుంటుంది? అని అలోచించి రాసిన కథ, తీసిన సినిమా ఈ 'హలో గురు ప్రేమ కోసమే'. ఈ ఆలోచనలో వున్నంత కొత్తదనం కథలో, సినిమాలో లేదు. రొటీన్‌గా వుంటుంది. కానీ, కామెడీ మాత్రం వర్కవుట్ అయ్యింది. ఫస్టాఫ్ అంతా సరదా సరదాగా వెళ్తుంది. మూడు పంచ్ డైలాగులు, ఆరు నవ్వులు అన్నట్టు వెళ్తుంది. ఇందులో భాగంగా వచ్చే సన్నివేశాలకు యూత్ బాగా కనెక్ట్ అవుతారు.

ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ట్ర‌ైనింగ్ క్లాస్ రూమ్ సీన్‌, కాఫీ షాప్ సీన్.. యూత్ కి నచ్చుతాయి. వాటిలో తమను తాము చూసుకుంటారు. ముందు ప్రణీత వెంటపడిన రామ్, ప్రణీత ప్రపోజ్ చేసే సమయంలో తను అనుపమను లవ్ చేస్తున్నానని అర్థం చేసుకునే సన్నివేశం అంత కన్వీన్సింగ్ గా అనిపించదు. కానీ, అప్పటివరకూ నవ్వించారు కాబట్టి ప్రేక్షకులు ఎవరూ పెద్దగా నోటీస్ చేయరు. కానీ, అప్పటినుంచి అసలు కథ ఎప్పుడు మొదలైందో? అన్న ప్రేక్షకుడికి కథ మరీ రొటీన్ గా వెళ్తుందన్న విషయం అప్పుడు కానీ అవగతం కాదు. అయితే సినిమా మాత్రం దసరా పండుగ వేళ.. సరదాగా సాగిపోయే కామెడీ, యూత్ ఫుల్ రోమాంటిక్ ఎంటైర్ టైనర్ గా నిలించింది.

నటీనటుల విషానికి వస్తే

హీరో రామ్ చాలా ఎనర్జిటిక్ గా నటించాడు. లవ్, కామెడీ స్టోరీల్లో అతడి నటన ఎలా ఉంటుందో.. రెడీ, నేను శైలజ చిత్రాల తరహాలో మాదిరిగా ఈ సినిమాలోనూ రామ్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. హీరో హీరోయిన్ మధ్య సన్నివేశాలు ప్రేక్షకుల చేత నవ్వులు పూయిస్తాయి. ఫ్యామిలీ గర్ల్‌గా, తండ్రిని ఎంతో ఇష్టపడే అమ్మాయి పాత్రకు అనుపమ న్యాయం చేసింది. ఇక అను తండ్రిగా ప్రకాశ్ రాజ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

హీరో రామ్.. హీరోయిన్ తండ్రి ప్రకాష్ రాజ్ ల మధ్య సన్నివేశాలు నవ్విస్తాయి. ఓ పక్క అమ్మాయి తండ్రిగా.. మరో పక్క తన కూతుర్ని ప్రేమించిన కుర్రాడికి స్నేహితుడిగా తనకే సాధ్యమైన నటనను కనబరిచారాయన. అను తల్లిగా ఆమని మాట్లాడే బట్లర్ ఇంగ్లిష్ నవ్విస్తుంది. ఈ సినిమాలో మరో కీలకమైన పాత్ర ప్రణితది. నాలుగు సన్నివేశాల్లో నటించి.. ఓ పాటలో మెరిసినా.. అమె పాత్రకు మాత్రం అంత ప్రాముఖ్యత లేదు. మిగతా పాత్రలన్నీ సందర్భానుసారం వచ్చి వెళ్తుంటాయి. కానీ వాటికి కూడా అంతగా ప్రాధాన్యం దక్కలేదనే చెప్పాలి.

{youtube}v=PQXJ7SHLXdM|620|400|1{/youtube}

టెక్నికల్ అంశాలకు వస్తే..

ఇది రొటీన్ కథే అయినప్పటికీ.. వైవిధ్యంగా తెరకెక్కించేందుకు డైరెక్టర్ ప్రయత్నించాడు. ఎక్కడా బోర్ కొట్టకుండా కథనాన్ని నడిపించారు. కానీ సెకండ్ హాఫ్ లో ప్రకాశ్ రాజ్-రామ్ మధ్య వచ్చే సీన్లు మరింత ఎఫెక్టివ్ గా ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. అనుపమ క్యారెక్టర్ ను మరింత ఎలివెట్ చేస్తే ఆడియెన్స్ మరింతగా కనెక్ట్ అయ్యేవారు. స్టోరీ ముందే అర్థమైపోవడం వల్ల ప్రేక్షుకుడిలో ఆసక్తి తగ్గుతుంది. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

రామ్ కాస్ట్యూమ్స్ ట్రెండ్‌కు తగ్గట్టుగా ఉన్నాయి. ప్రసన్న కుమార్ డైలాగ్స్ పేలాయి. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ వర్క్, దేవీ శ్రీ సంగీతం ఇంకాస్త మెరుగ్గా ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. మెత్తానికి దసరా పండగ పర్వదినాన విడుదలైన ఈ సినిమా సరదాగా కాసేపు నవ్వుకోవాలని ఆలోచించే వాళ్ళ కోసమే. లాజిక్స్ గురించి కాకుండా మేజిక్స్ ఎంజాయ్ చేస్తూ కాసేపు నవ్వుకుందాం అనుకుంటే సినిమాకు హాయిగా వెళ్లొచ్చు.

తీర్పు..

మాట‌ల తూటాలను పేల్చుతూ.. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే యూత్ పుల్ రోమాంటిక్ చిత్రంగా.. రామ్ ఎనర్జిటిక్ పర్మామెన్స్, ప్రకాష్ రాజ్ నటన చిత్రానికి బలంగా నిలుస్తుంది.

చివరగా... పండగ వేళ.. సరదగా చూసి నవ్వుకునే చిత్రం..

Posted: October 18, 2018, 9:55 am
‘అరవింద సమేత వీరరాఘవ’

విశ్లేషణ

‘వాడిదైన రోజున ఎవ‌డైనా కొట్ట‌గ‌ల‌డు. అస‌లు గొడ‌వ రాకుండా ఆపుతాడు చూడు.. వాడు గొప్పోడు’ అన్న పాయింట్ ను బేస్ చేసుకుని కథ సిద్దం చేసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఫ్యాక్షనిజాన్ని మరో కోణంలో ఎలివేట్ చేసి.. ఫ్యాక్షనిజంలోకి వెళ్లే భర్తల కోసం భార్యలు, తండ్రుల కోసం పిల్లలు పడే అవేదన.. అందోళనను చూపాడు త్రివిక్రమ్. అయితే రక్తపుటేరులు పారించే కుటుంబం నుండి ఓ ధృవతార వచ్చి.. హింస‌కు, ర‌క్తపాతానికి దూరంగా ఆ ఊరిని కాపాడటం.. మాటల మాంత్రికుడు తన శైలికి భిన్నంగా తెరకెక్కించిన కథే ‘అరవింద సమేత వీర రాఘవ’.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌తో తొలి చిత్రం ఇదే కావడంతో పాటు.. ‘అజ్ఞాతవాసి’ డిజాస్టర్ తరువాత త్రివిక్రమ్ హిట్ కొట్టాలన్న కసితో ఈ సినిమా తెరక్కించారు. ఆయన శైలికి భిన్నంగా ఔట్ అండ్ ఔట్ మాస్ అండ్ క్లాస్ ఎలిమెంట్స్‌తో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ‘అరవింద సమేత’ చిత్రాన్ని రూపొందించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకుందినడటంలో సందేహమే లేదు.

మొద‌టి ఇర‌వై నిమిషాల క‌థ చాలా ప‌క‌డ్బందీగా సాగుతుంది. ఎమోష‌న‌ల్ గా బాగా డ్రైవ్ చేశాడు. ఈ సినిమాలో ఎమోష‌న్ కంటెంట్ ఉంటుంద‌ని ఒక ర‌కంగా ప్రేక్ష‌కుడిని ముందే సిద్ధం చేశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. క‌థ హైద‌రాబాద్ చేరిన త‌ర్వాత తేలిక ప‌డుతుంది. ద్వీతీయార్థంలో అసలు కోణం బయటపడుతుంది. ఈ కథంటే్న్నది కొన్ని పాత్రల ద్వారా చెప్పిస్తాడు త్రివిక్రమ్. ప్రీ క్లైమాక్స్ కాస్త‌ సాగ‌దీసిన‌ట్లు అనిపించినా, క్లైమాక్స్ లో మ‌ళ్లీ క‌థ‌ను ఫామ్ లోకి తీసుకొచ్చాడు ద‌ర్శ‌కుడు. ఒక ర‌కంగా ఈ సినిమాకు క్లైమాక్సే ప్రాణం.

నటీనటుల విషానికి వస్తే

ఈ సినిమాలో వీరరాఘవ ప్రాత్రకు నూటికి నూరుపాళ్లు న్యాయం చేశాడు జూనియర్ ఎన్టీఆర్. క‌థ‌కు, ద‌ర్శ‌కుడు రాసుకున్న వీర‌రాఘ‌వ పాత్రకు తారక్ ఇచ్చిన ఫర్మామెన్స్ అదుర్స్. ఈ చిత్రంతో తన తండ్రిని దూరం చేసుకున్న బాధను కూడా దిగమింగుకుని ఎన్టీఆర్ చేసిన నటన, అభినయానికి సెంట్ పర్సెంట్ మార్కులు ఇవ్వోచ్చు. ఇన్ని ఎమోష‌న‌ల్ సీన్స్ ఎన్టీఆర్ ఎప్పుడూ చేయ‌లేదు. తొలి ఇర‌వై నిమిషాలు పూర్తిగా ఎన్టీఆరే క‌నిపిస్తాడు. ప్యాక్షన్ చిత్రాలలో హీరో అనేందుకు పూర్తి భిన్నంగా వుంటాడు తారక్.

పూజా హెగ్డే కూడా తన పాత్రకు పరిపూర్ణ న్యాయం చేసింది. ఆమె పాత్ర కూడా క‌థ‌లో కీల‌క‌ం కావడం... ఒక ర‌కంగా క‌థానాయ‌కుడి పాత్ర‌లో మార్పు రావ‌డానికి బ‌లంగా దోహ‌దం చేసింది. వెండితెర‌పై క‌నిపించే ప్ర‌తి చిన్న పాత్ర‌నూ చాలా బ‌లంగా తీర్చిదిద్దాడు ద‌ర్శ‌కుడు. అందుకే ఏ పాత్ర‌నూ ప్రేక్ష‌కుడు అంత త‌ర్వ‌గా మ‌ర్చిపోలేడు. బాలిరెడ్డిగా జ‌గ‌ప‌తిబాబును చాలా క్రూరంగా చూపించాడు. ఆయ‌న కూడా ఎక్క‌డా బోరింగ్ కొట్ట‌కుండా న‌టించారు. ఈ సినిమాతో ఆయ‌న‌కు మ‌రో మంచి పాత్ర దొరికింది. నీలాంబ‌రిగా సునీల్ ఆక‌ట్టుకుంటాడు. ప్ర‌తి పాత్రా క‌థ‌ను ముందుకు న‌డిపించేందుకు దోహ‌ద‌ప‌డేదే. బసిరెడ్డి కొడుకుగా బాలిరెడ్డి పాత్రలో అందాల రాక్షసి ఫేమ్ నవీన్ చంద్ర ఆకట్టుకున్నారు. నరేష్, రావు రమేష్, శుభలేక సుధాకర్, సితార, దేవయాని, బ్రహ్మాజీ, జబర్దస్త్ చంద్ర ఇలా ప్రతి పాత్రకు తగిన ప్రాధాన్యత ఉంది.

{youtube}v=SwfEJQe_iJA|620|400|1{/youtube}

టెక్నికల్ అంశాలకు వస్తే..

సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతస్థాయిలో వున్నాయి. పీఎస్ వినోద్ ఛాయాగ్రహణం సినిమాకు అదనపు బలంగా నిలించింది. హీరో తారక్ ను చూపించిన తీరు, యాక్షన్ సన్నివేశఆలు తెరకెక్కించిన విధానం అకట్టుకుంటాయి. అయితే ద్వీతీయార్థంలో ప్రీ క్లైమాక్స్ కు ముందు సినిమా సాగదీసినట్టు అనిపించడం.. నిడివి కాసింత ఎక్కవగా వుందని అనిపిస్తుంది. ఎడిటర్ నవీన్ నూలీ తన కత్తెరకు మరింత పదును పెడితే బాగుండేదని అనిపిస్తుంది.

‘అరవింద సమేత’ చిత్రంతో కెరియర్‌లో బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు తమన్. ‘రం.. రుధిరం.. సమరం.. శిశిరం, రం.. మరణం.. గెలవమ్.. ఎవరం’ అంటూ సాగే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. ‘పెనిమిటి’,‘అనగనగనగా’, ‘ఏడపోయినాడో’, ‘రెడ్డి ఇక్కడ సూడు’ అన్ని సాంగ్స్ విజువల్‌గా బాగా కుదిరాయి. ముఖ్యంగా పెనిమిటి, ఏడపోయినాడో సాంగ్స్‌ ప్రేక్షకుల్ని కన్నీళ్లు పెట్టించాయి. త్రివిక్రమ్ తన శైలికి భిన్నంగా కథను ఎంపిక చేసుకుని తెరకెక్కించిన భావోద్వేగంతో కూడిన చిత్రం.. అందుకు అనుగూణంగా రాసుకున్న మాటలు ఈ చిత్రానికి మరో బలం.

తీర్పు..

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరి తొలి కాంభినేషన్ లో ఫాక్షన్ నేపథ్యంలో వచ్చిన భావోద్వేగాల చిత్రం..

చివరగా... శాంతికామకుడు అరవింద సమేత వీరరాఘవుడు..

Posted: October 11, 2018, 10:29 am